Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

సంఘానికి సందేశము
నిశ్శబ్ద పునరుజ్జీవన ప్రక్రియ
06 October 2013

నిశ్శబ్ద పునరుజ్జీవన ప్రక్రియ

 మీ దేహాన్ని దేవుడే మీకిచ్చాడని, మీలోని పరిశుద్ధాత్మకు అది నిలయమని మీరెరుగరా? అని కోపంగా, బాధగా కూడా పౌలు ప్రశ్నించాడు (1 కొరి 6:19).
 

విశృంఖల జీవన సరళికి అలవాటు పడ్డ కొరింథి ప్రాంతంలోని చర్చికి, విశ్వాసులకు ఆయన చేసిన హెచ్చరిక ఇది. దేవుడు తన రూపంలో, స్వహస్తాలతో రూపించి తన జీవాత్మను ఊదగా మనం జన్మించామని ఎన్నడూ మరువరాదు. సువిశాలమైన ఈ విశ్వానికి మకుటంగా, ఏలికగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఈ దేహం తుచ్ఛమైనది, మట్టిలో కలిసిపోయేది, పాప భోగేచ్ఛలకు నిలయమన్నది కొన్ని తత్వాల బోధన. నిజమే, కాని రోగనిర్థారణ చేస్తే, సమస్య దేహంలో లేదు, దేహాన్ని నియంత్రించే నియమావళిలోనేనని తెలుస్తుంది. దైవ నియమావళిలో నడిచే దేహాలను పొందిన తొలి మానవులు ఆదాము, హవ్వ దైవ వ్యతిరేక శక్తియైన సాతాను ప్రలోభంలో పడి అతని పాప నియమావళికి తమ దేహాల్ని వశం చేశారు. మానవాళినంతా శాపగ్రస్థుల్ని చేశారు. అయితే దేవుడే చొరవ తీసుకుని తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో చేసిన రక్షణ యాగం ద్వారా, దైవమానవాళితో తమ దేహాలను నియంత్రించుకునే వెసులుబాటు కల్పించాడు.
  కాబట్టి దేవుడెంత శాశ్వతమో రక్షణ యాగమూ అంతే శాశ్వతమైనది. అందుకే విశ్వాసి తనను తాను దేవునికి సజీవ యాగంగా అర్పించుకునే ప్రయత్నంలో, అతనిలో పాప నియమావళికి, దైవనియమావళికి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మంచి చేయాలనుకున్నా చేయలేకపోవడం, వద్దనుకుంటూనే చెడు చేయడమనేది ఆ సందిగ్ధం ఫలితమే: (రోమా 7:17-25).
  రెండు పక్షాల్లో ఒక పక్షం ఓడిపోతే లేదా లొంగిపోతేనే సంఘర్షణ లేదా యుద్ధం ముగుస్తుంది. అయితే తనలో దైవ నియమావళియే గెలవాలన్న బలమైన కాంక్ష విశ్వాసికుంటే దేవుడు కూడా అతన్ని బలపర్చుతాడు. ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడంటే ఇంటిని అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుంటాం. మరి పరిశుద్ధాత్మ నివాసానికి యోగ్యమైనదిగా మన దేహాలను తీర్చిదిద్దడానికి మరింత శ్రద్ధ తీసుకోవాలి. వెంట్రుకలు తెల్లబడ్డా, చర్మం ముడతలు పడ్డా, మచ్చలు పడ్డా చికిత్సలకు, క్రీములకు బోలెడు డబ్బు, సమయం వ్యయం చేస్తాం. దేహం పై పై మెరుగులకే ఇంత హైరానా పడితే, మన ఆంతర్యపు ఆత్మీయ శుద్ధికోసం ప్రార్థన, వాక్య పఠనం, దీనత్వం వంటి పారలోకిక వ్యాయామాల పట్ల మరింత శ్రద్ధ చూపాలి. మన దేహాన్ని పాపాలకు నిలయం చేయడం ద్వారా దాని విలువను దిగజార్చే సాతాను కుట్రను విశ్వాసి ప్రతిక్షణం ప్రతిఘటించడం ద్వారానే దేవునికి మహిమ తెస్తాడు. శరీర రుగ్మతలపైన ఉన్నంత శ్రద్ధ ఆత్మీయ స్థితి పట్ల మనకు లేకపోతే అది నిజంగా ప్రమాద సూచిక. తానే వెలుగైన దేవుడు ‘మీరు లోకంలో వెలుగై ఉన్నారని విశ్వాసులతో అన్నాడు.
  కొండ మీద కారుచీకట్లో ఒంటరిగా నిలబడి కాంతులీనుతూ దూరంలోని నౌకలకు దిశా నిర్దేశం చేసే ‘లైట్ హౌస్’ది నిజమైన వెలుగు పరిచర్య. చీకటిని చీల్చి చెండాడే ఆ సమరంలో వెలుగు రవ్వంత కూడా శబ్దం చేయకపోవడం గొప్ప విషయం. అది నిశ్శబ్దంగా, అత్యంత సమర్థవంతంగా తన పని చేసుకుని పోతుంది. అందువల్ల వెలుగు నిత్యత్వానికే కాదు, నిశ్శబ్దానికి కూడా గుర్తే! ప్రసంగాలు, వాదనలు తర్కాలు శబ్దకాలుష్యానికి అతీతమైన నిశ్శబ్ద శాంత జీవనం విశ్వాసిది. నిశ్శబ్దంలోని ఈ శక్తి, చర్చిల పైకప్పులు ఎగిరిపోయేలా డప్పు వాద్యాలు, అరుపులు, కేకలతో చేసేదే ఆరాధనగా భావించే వారికి అర్థం కావాలి.

 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

సామెతలు 21:21 ఎవరైతే ధర్మాన్ని, ప్రేమను అనుసరిస్తారో వారు జీవితం, శ్రేయస్సు మరియు గౌరవాన్ని పొందుతారు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech