mahimasabdam.tv@gmail.com
+91 9390209376
ఒక క్రిస్టియన్ ఫాదర్ గారు దేశదేశాలు పర్యటించి దేవుని వాక్యాన్ని అందరికీ చేరవేస్తుండేవారు. ''బైబిల్ లో చెప్పిన ఈ ప్రార్థనను మీరూ నేర్చుకోండి. ఈ విధంగా దేవుడిని ప్రార్థించాలి. మీకు తప్పక విముక్తి లభిస్తుంది'' అని ఆయన గంభీరంగా ప్రవచిస్తే, ప్రజలు మంత్రముగ్ధులై ఆయన చెప్పినట్లు చేసేవాళ్ళు.
ఆ రోజుల్లో ఖండాల్ని దాటేందుకు పడవ ప్రయాణం తప్ప వేరే మార్గం లేదు. పాస్టరుగారు తన అనుచరులతో కలిసి ఓడలమీద దేశదేశాలూ తిరుగుతూ ఉండేవారు.
ఒకసారి, ఆయన అలా సముద్రయానం చేస్తుంటే, దూరంగా ఒక దీవి కనబడ్డది. ఉత్సాహవంతుడైన మన పాస్టరుగారికి ''అక్కడ మనుషులు ఎవరైనా ఉంటారేమో చూద్దాం'' అనిపించింది. '' వరైనా ఉంటే వాళ్ళకూ దైవ ప్రార్థన నేర్పించవచ్చు కదా, అలా మరికొంతమందికి ముక్తిమార్గాన్ని చూపినట్లౌతుంది'' అని, ఆయన ఓడను అటువైపుకు తిప్పమన్నాడు.
ఆ దీవి నిర్జనంగా ఉంది. పాస్టరుగారు తన అనుచరులతో కలిసి దీవిలో కొంతసేపు తిరిగి చూశారు. మానవమాత్రులు ఉంటున్న జాడలే లేవు అక్కడ. పాస్టరుగారు ఇక వెనక్కి తిరుగుదామనుకున్నంతలో ముగ్గురు ముసలివాళ్ళు దూరంనుండి ఆయనవైపే వస్తూ కనబడ్డారు. వాళ్ళ జుట్టు పొడుగ్గా ఉండి, తెల్లగా మెరిసిపోతున్నది. తెల్లటి గడ్డాలు- బాగా పెరిగి ఉన్నై, వాళ్లకు. వాళ్ళు తమ శరీరాల్ని చెట్ల ఆకులతో కప్పుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకేలాంటి వస్తువులూ లేవు.
పాస్టరుగారు ఆగి, వాళ్ళకోసం చూశారు. వాళ్ళు దగ్గరికి రాగానే అయన వాళ్లను '' దీవిమీద ఏదైనా గ్రామంగాని, పట్టణంగాని ఉన్నదా?''అని అడిగాడు.ఒక ముసలాయన వినయంగా జవాబిచ్చాడు- '' లేదండీ, ఈ దీవిమీద కేవలం మేం ముగ్గురమే నివసిస్తున్నాం. ఇంకెవ్వరూ లేరు ఇక్కడ. మేం పండ్లు తిని, నీళ్ళు తాగుతుంటాం. ఎవరైనా మీలాంటి యాత్రీకులు అనుకోకుండా ఇటువైపుకు వస్తే మేంవాళ్లకూ ఇవే ఇస్తుంటాం '' అని.''అయ్యో!'' జాలి పడ్డారు పాస్టరుగారు. '' ఇదా, మీరు చేస్తున్నది? ఎంత దురదృష్టవంతులు, మీరు? రోజంతా ఖాళీగా ఇలా మీ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నారు, పాపం. మిమ్మల్ని సృష్టించిన భగవంతుడు ఒకడున్నాడని కూడా గుర్తించలేని మీ జన్మ వృధా కాదా?''అని. '' అలాంటిదేమీ లేదు. మేం ఆయన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అది తప్ప మాకు వేరే పనేదీ లేదు '' అన్నాడు రెండవ ముసలాయన.'' అవునా, ఎలా గుర్తు చేసుకుంటుంటారు, చెప్పండి? '' అడిగారు పాస్టరుగారు. '' రోజూ మేం ముగ్గురం కలిసి కూర్చుంటాం. ఆపైన ఆకాశం వైపుకు చూస్తూ, చేతులు పైకెత్తి- '' మేం ముగ్గురం, మీరూ ముగ్గురే. మమ్మల్ని కాపాడండి '' అంటాం.''చెప్పాడు మూడవ ముసలాయన.ఫాదరుగారు నవ్వారు.''ఎ ంత పిచ్చి ప్రార్థన, ఇది?! మీరు ముగ్గురూ ముసలివాళ్లయ్యారు. కాటికి కాళ్ళు చాపే వయసు మీది. ఇంత గొప్ప జీవితాన్ని ఇలా వ్యర్ధంచేసుకున్నారంటే, మీమీద నాకు జాలి కల్గుతున్నది. రండి- కూర్చోండి ఇక్కడ. అసలు ప్రార్థన ఎట్లా చేయాలో మీకు నేను నేర్పుతాను ''అన్నారు.
ముగ్గురూ కూర్చున్నాక, ఆయన వాళ్ళకు సరైన పద్ధతిలో ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. చదువురాని ఆ మొద్దులకు ప్రార్థన నేర్పించటం కొంచెం కష్టమే అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఆ పదాల్ని మర్చిపోతూ వచ్చారు. అయినా పాస్టరుగారు విసుక్కోకుండా వాళ్లకు మళ్ళీ మళ్ళీ నేర్పారు. వాళ్ళ బాగుకోసం ఆ మాత్రం శ్రమపడితే పరవాలేదనుకున్నారు ఆయన. చివరికి, వాళ్ళకు ప్రార్థన చేసుకోవటం వచ్చేసిందనిపించాక, పాస్టరుగారు సంతృప్తిగా ఓడనెక్కి, తన ప్రయాణంకొనసాగించారు.
ఓడ ఆగకుండా పోతున్నది. మరునాటి మధ్యాహ్నంవేళ, పడవను నడిపేవాడొకడికి, వెనుక వైపున- దూరంగా సముద్రంమీద ఒక ఆకారం కనబడ్డది.'' దేమై ఉంటుంది? '' అని వాడు అందరినీ అడిగాడు. దుర్భిణిలోంచి చూసిన పాస్టరుకు అక్కడ ఒకటికాదు- మూడు మానవాకారాలు కనబడ్డై. '' అవేమిటి? '' అని అందరూ ఆశ్చర్యపోతూనే ప్రయాణం కొనసాగించారు.అయితే కొద్ది సేపటికి వాటి రహస్యం తేటతెల్లమైంది. వాళ్ళు మనుషులే! పాస్టరుగారు క్రితంరోజున ప్రార్థన నేర్పిన ముగ్గురు మూర్ఖులే వాళ్ళు. నట్టనడి సముద్రంలో, నీళ్లమీద, ఓడకంటే వేగంగా పరుగెత్తుకొని వస్తున్నారు వాళ్ళు. పాస్టరుగారు ఓడని నిలబెట్టారు. '' ఈ ముసలివాళ్ళు ముగ్గురూసముద్రంలో మునిగిపోలేదు- ఎందుకు? '' అని ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. అంతలో వాళ్ళు ఓడను చేరుకొని అందరికీ నమస్కరించారు.'' ఫాదర్, మమ్మల్ని మీరే కాపాడాలి. మేం ముగ్గురం చదువురాని వాళ్ళం, పల్లె మనుషులం. నిన్న మీరు అంత శ్రమకోర్చి నేర్పిన ప్రార్థన, ఈ రోజు ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తు రాలేదు మాకు. మీరు అన్యధా భావించకండి, నిన్నటి ప్రార్థననే మళ్ళీ ఓసారి నేర్పించాలి మాకు. ఈసారి తప్పకుండా గుర్తుంచుకుంటాం '' అన్నారు వాళ్ళు.ఇంకా ఆశ్చర్యంనుండి తేరుకోని పాస్టరు గారు '' కానీ, ముందు ఈ సంగతి చెప్పండి నాకు- మీరు నీళ్లమీద ఎట్లా పరుగెత్త- గల్గుతున్నారు? '' అని అడిగారు.'' అదేమంత కష్టం కాలేదు '' చెప్పాడు వాళ్లలోఒకడు- '' మేం దేవుడితో చెప్పాం-''దేవుడా, మాకు పడవ లేదు. ప్రార్థన నేర్చుకోవటంకోసం మేం పరుగెత్తుతాం'' అని. ఆ తరువాత మేం పరుగు మొదలుపెట్టాం'' అన్నాడు.అప్పటివరకూ ఆ ముగ్గురు అనాగరికుల్నీ చిన్నచూపు చూసిన పాస్టరుగారి కళ్ళు తెరుచుకున్నాయి.ఆయన గౌరవంగా చేతులు జోడించి, '' పవిత్ర మూర్తులారా! మీరు వెంటనే వెనక్కి పోండి. మీ పాత ప్రార్థనను మీరు నిశ్చింతగా కొనసాగించుకోండి. దాన్ని అస్సలు మార్చనక్కర్లేదు. దేవుడికి మీ భావనలు అర్థం అవుతున్నాయి- ఆయనకు మాటలతో అసలు పనే లేదు'' అన్నాడు.భగవంతునికి మన మాటలతో పనిలేదు- అంత:కరణం ఎలా ఉన్నదనేదే ముఖ్యం.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech