Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

సరిదిద్దుకొనుట
01 June 2014

సరిదిద్దుకొనుట

19వ శతాబ్దము ఆరంభములో జపాన్‌ దేశము కొరియాను ఆక్రమించుకొన్నది. అప్పటివరకు అనేక మంది కొరియాను ఆక్రమించుకొన్నను జపాన్‌ వారు బహుక్రూరముగా ప్రవర్తించిరి. స్త్రీల యెడలను, పిల్లల యెడలను బహుపైశాచికముగా ప్రవర్తించిరి. వారిలో ఎక్కువగా కష్టపడినది నష్టపోయినది క్రైస్తవులే. కొరియాను ఆక్రమించుకొన్న వెంటనే విదేశ మిషనెరీలందరూ కొరియాను విడిచి వెళ్ళవలెనని జపాన్‌ వారు ఆజ్ఞాపించిరి. జయించిన వారు చర్చిలను మూత వేసినచో క్రైస్తవ్యము అంతరించునని భావించిరి. రోమన్‌ ప్రభుత్వము వారు మొదటిగా ఆ పనిని చేసిరి. కాని ఎవరును క్రైస్తవ్యమును అంతమొందించలేక పోయిరి.

జపాన్‌ వాళ్ళు కొరియాలోనున్న సంఘ నాయకులను ఖైదు చేసిరి. సంఘస్తులను ఆరాధన చేసికొనుటకు కూడుకొనకూడదని ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞలు ధిక్కరించిన వారిపై ఎంతో పాశవికముగా దాడిచేసిరి. బాధించబడినవారి హృదయములో జపాన్‌ వారి యెడల ఏహ్యత కలిగెను. ఒక పాస్టర్‌ గారు జపాన్‌ పోలీసు అధికారి వద్దకు పదే పదే వెళ్ళి తాము సంఘముగా కూడుకొని ప్రభువును ఆరాధించుకొనుటకు అనుమతి ఇవ్వవలసినదని కోరెను. అతడు పదే పదే గోజాడుటవలన అతని మనవి అంగీకరించబడెను. ఆదివారమునాడు అనేక కొరియా కుటుంబముల వారు ఆరాధించుటకు వెళ్ళుచుండగా జపాన్‌ అధికారులు వారిని హేళనగా చూచుచుండిరి.

వారందరూ ఒక మందిరములో చేరి పాటలు పాడుచుండిరి. తలుపులు మూసి ఉన్నను వారి పాటలు శ్రావ్యముగా బయటకు వినబడుచున్నవి. చివరి రెండు పాటలు పాడుచుండగా జపాన్‌ వారి సైన్యము అక్కడికి వచ్చెను. అప్పటికి కొరియా వారు Nearer My God To Thee ప్రభువా నీకు సమీపముగా అను పాటను పాడుచుండగా చర్చి చుట్టూ పెట్రోలును చల్లిరి. చెక్కతో నిర్మించబడిన ఆ చర్చి అగ్గిపుల్ల గీసిన వెంటనే మండుట ప్రారంభించబడెను.

 మంటలు బాగా పైకి ఎగసినవి. తలుపులు మూయబడి ఉన్నవి కనుక కొందరు పురుషులు కిటికీల నుండి దూకి పారిపోవుదమని తలంచిరి. కాని కిటికీ బయట ఉన్న సైనికులు వారిపై బుల్లెట్‌ల వర్షమును కురిపించిరి. అందువల్ల వారి శరీరము జల్లెడవలె మారినది. పాస్టర్‌ గారికి తమ అంతము సమీపించినదని తెలిసినది. ఈ లోకమునకు వీడ్కోలు గీతమును పాడి పరలోకమునకు వెళ్ళి పోవలెనని గుర్తించెను. పొగతో వారి కన్నులు మండుచున్నవి.

నా వంటి మట్టి పురుగునకు ఆయన ఏల ప్రాణమర్పించెను? ఆయన ప్రేమకు నేనేమి చెల్లింతును? నా ప్రాణమర్పింతును అని పాడుచుండగా ఆ మందిరము యొక్క పై కప్పు కూలి మంటలు మరింతగా విజృంభించినవి. విరిగి పడుచున్న గోడల శబ్ధముతో సంఘ సభ్యుల ఆక్రందనలు కలిసిపోయెను. మాంసము కాలుచున్న కమురు వాసన ఆ ప్రాంతమంతటా వ్యాపించెను. శరీరము కాలి నల్లటి మసి బొగ్గువలె మారెను. (కాని వారి ఆత్మలు దేవుని సింహాసనము ముందు మిగిలిన పాటను పాడుచుందురని నా అభిప్రాయము) కాలి మసైపోయిన ఆ శిధిలములను తొలగించుట తేలిక కాని జపాన్‌ వారి యెడల అసహ్యతను తొలగించుటకు ఎన్నో ఏండ్లు పట్టును. మరణించిన వారి బంధువులు (ఆ రోజున మందిరములో లేనివారు) జపాన్‌ వారిపై ఎంతో అసహ్యతను కలిగియుండిరి.

ఈ సంఘటన జరిగి అనేక థాబ్ధములు గడిచినను జపాన్‌ వారి యెడల కొరియా వారికి కల అసహ్యత పోలేదు. క్రొత్త తరము వచ్చినను వారి హృదయములో అసహ్యత అట్లే ఉన్నది. ఈ మందిరము ఉన్న చోట కొరియా వారు నిర్మించిన స్మారక స్థూపము (మందిరములో ఆరిపోయిన అగ్నిని) కొరియా వారి హృదయములో మండింప జేయుచుండెను. కొరియా వారు ఈ సంఘటనను మర్చిపోలేక జపాన్‌ వారిని క్షమించలేక పోయిరి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అను మాట వారికి అర్థము కాలేదు.

1972లో కొందరు జపాన్‌ దేశపు దైవ సేవకులు ఆ సంఘటనా స్థలమును దర్శించి స్మారక స్థూపముపై చెక్కబడిన చనిపోయిన వారి పేర్లను చూచి ఎంతో సిగ్గుపడిరి. జపాన్‌ దేశస్థులు పాపము చేసిననూ అది తామే చేసినట్లు వారు భావించిరి. నిజమునకు వారెవరూ ఆ సంఘటనలో పాలుపంచు కొనలేదు. కొందరైతే అప్పటికి జన్మించలేదు. వారు తిరిగి జపాన్‌కు వచ్చి జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తము చేయవలెనని సంకల్పించిరి. 1972లో ఇరువది అయిదువేల డాలర్లను వారు సేకరించి ఆ ధనముతో ఒక చక్కని చర్చి బిల్డింగును కాలిపోయిన చర్చి స్థానములో నిర్మించిరి.

ఆ చర్చి ప్రతిష్ఠ ఆరాధనకు చనిపోయిన వారి బంధువులు కొందరు జపాన్‌ దేశపు పాస్టర్లు దానికి హాజరైరి. కార్యక్రమము అంతములో Nearer My God to Thee అను పాటను మరల పాడవలెనని నిర్ణయించిరి. ఆ పాట పాడుచుండగా జపాన్‌ వారు తమ దుఃఖమును అణుచుకొనలేకపోయిరి. వారి హృదయ ఆవేదన కన్నీటి రూపమున బయటకు పొరలివచ్చెను. వారు కొరియా వారి వైపు తిరిగి క్షమించమని వేడుకొనిరి. జపాన్‌ వారి కన్నీటి ప్రవాహములో కొరియా వారి హృదయములో మండుచున్న ద్వేషాన్ని ఆరిపోయినది. ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు కార్చు చుండిరి. వారి మధ్య ఉన్న ద్వేషభావము సమసిపోయెను.- డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
-లూకా 14:11

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.