యవ్వనస్తులుPost Date:2014-04-25//No:10

యవ్వనజ్వాల అతి తెలివిఒక తల్లి తన కొడుకుని విద్యాధికుడైన ఓ గురువు దగ్గరకు తీసుకువచ్చింది. 'స్వామీ! వీడు నా కొడుకు. వీడికి తండ్రి లేడు. నా మాట అసలు వినడు. చదవడు. ఏ పనీ చేయడు. కాస్త నాలుగు మంచిమాటలు చెప్పి బాగుచెయ్యండి' అని కోరింది.

గురువు ఆ కుర్రాడివైపు చిరునవ్వుతో చూస్తూ, 'నీకు దేనిగురించి మంచి చెప్పాలి నాయనా?' అని అడిగాడు.

ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా పొగరుగా, అప్పుడే వేసిన తారురోడ్డు పక్కన పడివున్న తారువుండని చూపిస్తూ హేళనగా 'దాని గురించి చెప్పండి' అన్నాడు. గురువు బాగా చదువుకుని జ్ఞానియైనవాడు. ప్రతి సమస్యకూ పూజలు, జపాలు, ఉపవాసాలు చెయ్యమని సలహాలిచ్చేవాడు కాడు. కుర్రాడిని చూడగానే వాడు తెలివైనవాడనీ, చెప్పేవారు లేకనే ఆ విధంగా తయారైనాడని గ్రహించాడు.

బంతిలా కనబడుతున్న ఆ ఉండని తీసుకు రమ్మని, కుర్రాడు దాన్ని తీసుకొచ్చాక, 'దీని ఖరీదు ఎంతవుంటుందని నీ ఉద్దేశం?' అని అడిగాడు.

'ఏమీ ఉండదు'.

'దానిలోని తారు ఖరీదు?'

ముందే చెప్పినట్లు ఆ కుర్రాడు తెలివైనవాడు. 'ఇందులోని తారు ఖరీదు పదిరూపాయలు ఉండవచ్చునేమో' అన్నాడు.

'అవును నిజమే' అన్నాడు గురువు.'కానీ ఆ పెట్రోలియం మూలపదార్ధాన్ని మరోలా మార్చగలిగితే, అప్పుడది ప్లాస్టిక్‌ అవుతుంది. ఈ మాత్రపు బంతిలోంచి పదివేల సన్నటి తీవెలు తయారు చేయవచ్చు. జాగ్రత్తగా విను నాయనా! మనిషి గుండె ఆపరేషన్‌కు ఉపయోగించే ఆ ఒక్కొక్క సన్నటి తీవె ఖరీదు పదివేల రూపాయలు. అంటే.. పది రూపాయలు విలువ కూడా చేయని నీ చేతిలోని తారు, తన స్థానం మార్చుకుని పరిణితి చెందగలిగితే దాని విలువ పదికోట్లు అయ్యిందన్నమాట' అంటూ ఆగాడు.

అశువుగా చెప్పిన ఆ ఉదాహరణవిని అప్రతిభుడయ్యాడు ఆ కుర్రాడు. గురువు కొనసాగించాడు - 'కానీ, ఓసారి తారుగా మారిపోయాక ఇక నీ జీవితం కూడా అంతే. ముడిపదార్ధంగా ఉన్నప్పుడే దాన్ని కావల్సిన రీతిగా మార్చుకోవాలి. కాళ్ళక్రింద తారువి అవుతావో, గుండె కదిల్చే తీగెవి అవుతావో తేల్చుకో'.

జ్ఞానోదయమైనట్టు కుర్రాడు నమస్కరించాడు.

కొన్ని కోట్ల కోట్ల జ్ఞాన బిందువుల సముదాయం 'మెదడు'. దాన్ని ఎలా వాడుకోవాలో మనిషే నిర్ణయించుకోవాలి. కొందరి మెదడు బుల్లితెరని సృష్టించగలిగే అద్భుత జ్ఞానాన్ని కలిగి వుంటుంది. కొందరి మెదడు రేయింబవళ్ళు బుల్లితెరని చూడాలనే ఇష్టాన్ని కలిగి వుంటుంది. కొందరు తెలివినీ, కొందరు బద్దకాన్ని ఇష్టపడతారు. తెలివంటే అనుకున్న పనిని తొందరగా సాధించటానికి మెదడుని ఉపయోగించగలిగే సామర్ధ్యం! బద్దకమంటే అవసరమైన పని మానేసి ఇష్టమయిన పనిచేస్తూ, ఆ తరువాత బాధపడటం! 'తెలివి మెదడుకి సంబంధించినది, బద్దకం శరీరానికి సంబంధించినద'ని కొందరంటారు. కాదు. అదీ మనసుకి సంబంధించినదే. అయితే తెలివి వేరు. అతి తెలివి వేరు. తనకున్న దానికన్నా ఎక్కువ తెలివిని ఊహించుకోవటాన్ని అతి తెలివి అంటారు.
యవ్వనజ్వాల